Home > తెలంగాణ > కాలువలో కొట్టుకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ మృతదేహం

కాలువలో కొట్టుకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ మృతదేహం

కాలువలో కొట్టుకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ మృతదేహం
X

రెండ్రోజుల క్రితం.. ప్రమాదవశాత్తు కాకతీయ కాల్వలో పడి గల్లంతైన హెడ్ కానిస్టేబుల్.. చివరకు మృతదేహంగా నీటిపై తేలుతూ కనిపించారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ముంజంపల్లి శివారులోని కాకతీయ కాలువలో మృతదేహం కొట్టుకురావడం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కాలువద్దకు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసారు. అది హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య మృతదేహమేనని నిర్దారించుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ లో కుటుంబంతో కలిసి నివాసముండే దుండె మల్లయ్య(50) పెద్దపల్లి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. ఆగస్ట్ 25న (గత శుక్రవారం) అతడు పని వుందని భార్య హేమలతకు చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఇలా వెళ్లిన భర్త సాయంత్రం అయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో భార్య కంగారుపడిపోయింది. భర్త స్నేహితులు, తోటి ఉద్యోగులకు ఫోన్ చేసినా అతడి ఆఛూకీ లభించలేదు. దీంతో ఆమె కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇదేరోజు మద్యాహ్నం తిమ్మాపూర్ మండల అలుగునూరు శివారులోని కాకతీయ కాలువలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని కాపాడేందకు ప్రయత్నించినా కాలువలో నీటిప్రవాహం ఎక్కువగా వుండటంతో కొట్టుకుపోయాడు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలపగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడున్న బైక్ ఆధారంగా కాలువలో పడి కొట్టుకుపోయింది హెడ్ కానిస్టేబుల్ మల్లయ్యే అని నిర్దారించారు.

మృతిచెందిన మల్లయ్యకు శ్రీజ, కీర్తన సంతానం. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శుక్రవారం వరకు మంథని ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబు వద్ద గన్మెన్ గా విధులు నిర్వహించారు మల్లయ్య. గతంలో హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెలకు రాజేందర్ కు కూడా గన్ మెన్ గా విధులు నిర్వహించారు. శుక్రవారం పని నిమిత్తం తిమ్మాపూర్ కు వచ్చిన మల్లయ్య తిరిగి వెళ్లే క్రమంలో తన వెంట తెచ్చుకున్న టిఫిన్ ను కాకతీయ కాల్వ వద్ద తిన్నారు. తరువాత చేతులు కడుక్కోవడానికి కాకతీయ కాల్వలో దిగగా ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గట్టిగా అరిచారు. అరుపులు విన్న స్థానికులు తాడు సాయంతో కాపాడేందుకు యత్నించినా సఫలం కాలేదు. తర్వాత ఆయన కనిపించలేదు.



Updated : 28 Aug 2023 8:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top