ఆడపిల్లలే పుడుతున్నారని భార్యకు 4 సార్లు అబార్షన్లు చేయించిన అడ్వకేట్
X
చదువుసంధ్యలు కలిగి ఉండీ, సొసైటీలో మంచి పేరున్న వ్యక్తులు కూడా... మగసంతానం కోసం వెర్రివేషాలు వేస్తున్నారు కొందరు వ్యక్తులు. కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టడం, మరో పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి .. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని తన భార్యకు నాలుగు సార్లు అబర్షన్ చేయించాడు. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ ఇల్లీగల్ గా స్కానింగ్ చేసి ఆడపిల్ల పుడుతుందని తెలియగానే ఈ దారుణాలకు పాల్పడ్డాడు. మరో ఘోరం ఏంటంటే బతికున్న భార్యను చనిపోయిందని చెప్పి మరో పెళ్లి చేసుకున్నాడు. మూర్ఖత్వం ఇలాంటి పనులు చేశాడనుకోవడానికి లేదు. బాగా చదువుకొని, బాధ్యతాయుతమైన వృత్తిలో కొనసాగుతున్నాడా నిత్యపెళ్లికొడుకు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన అమరేందర్ హైకోర్ట్ అడ్వకేట్ గా గుర్తించారు. అతడి తండ్రి మహేందర్ రిటైర్డ్ జడ్జి అని సమాచారం. వంశాభివృద్ధి కోసం మగపిల్లాడు లేడంటూ రెండో పెళ్ళి చేసుకున్నాడు అమరేందర్. భార్య పదే పదే ఆడపిల్లలకు జన్మనిస్తుందని తెలుసుకుని, ఆమెకు బలవంతంగా నాలుగుసార్లు అబార్షన్ చేయించాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నేరమైనప్పటికీ అక్రమంగా స్కానింగ్ చేసి ఆడపిల్ల పుట్టబోతోందని గుర్తించిన అమరేందర్ 4 సార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు తేలింది. అయితే ఆమెకు ఏ డాక్టర్ అబార్షన్ చేశాడు? లేక మాత్రలు ఎక్కడ వేసుకున్నాడు? అమరేందర్ తన భార్యకు అబార్షన్ చేయించడానికి ఎవరు సహకరించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాజకీయాల్లో జోక్యం కూడా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీగా మారిన తర్వాత అమరేందర్ తెలంగాణ రైతు రాజ్య సమితి (టీఆర్‌ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే అమరేందర్ పై సరూర్ నగర్ మహిళా పీఎస్ లో కేసు నమోదైంది. అమరేందర్ బారినపడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితులు, అమరేందర్ భార్య వేడుకుంటున్నారు. అప్పటికే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాడని అమరేందర్ చెప్పాడని భార్య వాపోయింది. నాలుగుసార్లు అమ్మాయిలని చెప్పి తనకు అబార్షన్లు చేపించాడని కన్నీరుమున్నీరయ్యింది. తనకు తెలియకుండా గతేడాది నవంబర్ లో సిద్ధిపేటలో రెండో పెళ్ళి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడపిల్లలు పుట్టారని తనని వదిలించుకోవాలని చూస్తున్నారని, తనకు పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులకు వేడుకుంది.