Kothapalli town: మున్సిపల్ ఆఫీస్ గుమ్మానికి చచ్చిన కోడిని వేలాడదీసి.. వినూత్న నిరసన
X
కుక్కల బారి నుంచి తమను కాపాడాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. కుక్కల దాడిలో కోడి చనిపోవడంతో దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీశాడు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అజీజొద్దీన్ తన ఇంట్లోని కోడిని వీధి కుక్కలు చంపేశాయని, మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వాపోతూ కోడి కళేబరంతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. గమనించిన కమిషనర్ వేణుమాధవ్, అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అజీజొద్దీన్ చేసేదేమీలేక కోడిని కమిషనర్ ఆఫీసు గుమ్మానికి వేలాడదీసి కొత్తపల్లి పట్టణ ప్రజల వాట్సాప్ గ్రూప్‌లో ఓ ఆడియోను విడుదల చేశారు.
ఆ ఆడియోలో.. కొత్తపల్లి మున్సిపాలిటీలో 5 వేల జనాభాకు 500 వీధికుక్కలున్నాయని, బండ్ల వెంట పడడం, రోడ్ల వెంట వచ్చేవారిని, చిన్న పిల్లలను, జంతువులను కరుస్తుండడంతో ప్రశాంతంగా తిరగలేకపోతున్నామన్నారు. మూడేండ్ల కింద మేకను చంపినప్పటి నుంచి కంప్లయింట్స్ ఇస్తూ వస్తున్నానని, కానీ మున్సిపల్అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.‘గత మూడున్నరేండ్లుగా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం వీధి కుక్కల నుంచి ప్రజలను, కోళ్లను కాపాడాలని గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సోమవారం నా ఇంట్లోకి కుక్కలు చొరబడి కోడిని చంపేశాయి. ఒక వేళ పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉండేది? మీరే ఆలోచించుకోవాలి’ అంటూ ఆడియోలో పేర్కొన్నారు.
ఆఫీసు గుమ్మానికి కోడిని వేలాడదీయడంపై కమిషనర్ వేణుమాధవ్ కరీంనగర్ సీపీతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయమై మున్సిపల్కమిషనర్ కె.వేణుమాధవ్‌ను వివరణ కోరగా మున్సిపాలిటీలో కుక్కల బెడద ఉన్న మాట వాస్తవమేనని, వాటి నియంత్రణ కోసం స్టెరిలైజేషన్ చేయాలని ఆరు నెలలుగా జిల్లా పశువైద్యాధికారితో మాట్లాడుతున్నామన్నారు. స్పెషల్ క్యాంప్పెట్టి బెడద తగ్గిస్తామని చెప్పినా ఇంతవరకు ఏమీ చేయలేదన్నారు. కుక్కల దాడిలోనే కోడి చనిపోయిందా? లేదా? అనే విషయమై విచారణ జరిపిస్తామని తెలిపారు.