F2, F3 సినిమాల్లో కూడా ఇలాంటి ఫ్యామిలీని చూసి ఉండరు
X
భార్య, ఇద్దరు కూతుళ్లు.. అంతేగా, అంతేగా అంటూ వారికి వంత పడే ఓ భర్త.. ఇలాంటివి ఇప్పటిదాకా సినిమాల్లోనే చూసిఉంటారు. కానీ నిజ జీవితంలో ఈ నలుగురూ కలసి ఓ అమాయకుడిని రూ. 4 లక్షల మేర మోసం చేశారు. అతడు కాస్త జాగ్రత్త పడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి చేసిన హై డ్రామా వెలుగులోకి వచ్చింది. సినిమా స్టోరీల్లో సైతం లేని ట్విస్టులు.. ఈ డ్రామాలో నడిచాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో చోటుచేసుకుంది.
ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసే బోధన్ కు చెందిన యువకుడు.. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమొనీలో పేరు నమోదు చేసుకున్నాడు. అతడి వివరాలు తెలుసుకొని పెళ్లి చేసుకుంటానని చిలక పలుకులు పలికింది ఏపీలోని వైజాగ్‌కు చెందిన స్వాతి అనే మహిళ. గతేడాది అక్టోబరులో మొదలైన వీరి పరిచయంలో ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. స్వాతికి ఇంతకుముందే పెళ్లై భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ విషయాలేవీ తెలియని సదరు యువకుడు రోజూ ఫోన్ లో గంటల తరబడి మాట్లాడేవాడు.ఇక్కడి వరకు సజావుగా కథ నడిపిన సదరు మహిళ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానాలో ఉన్నానంటూ అత్యవసరంగా డబ్బు కావాలని యువకుడిని కోరింది. అప్పటి నుంచి క్రమంగా అవసరం మేరకు అతడిని డబ్బుల కోసం వాడుకుంటూ వచ్చింది. ఇలా రూ.4 లక్షలు కాజేసింది.
పరిచయమై ఏడాది సమీపిస్తుండటంతో పెళ్లి చేసుకోవాలని యువకుడు ఒత్తిడి పెంచాడు. దీంతో ఆమె యువకుడి నెంబరు బ్లాక్ చేసింది. అనుమానం వచ్చి ఆరా తీయగా స్వాతి గురించి అసలు నిజం తెలిసింది. ఇదే విషయమై ఆమెను నిలదీయగా.. ‘మమ్మల్ని ఇబ్బంది పెట్టావు’ అని బెదిరిస్తూ ఎదురుదాడికి దిగింది. దీంతో కంగుతిన్న యువకుడు కోర్టును ఆశ్రయించి బోధన్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. స్వాతి, ఆమె భర్త, ఇద్దరు కూతుళ్లు కలిసే మోసానికి పాల్పడినట్లు తేలింది. అప్పుడప్పుడు స్వాతి స్నేహితురాళ్లుగా యువకుడితో ఆమె కూతుళ్లే మాట్లాడినట్లు తెలిసింది. ఆమె కుటుంబమే ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.