Free Bus Journey: 'మహిళలకు ఉచిత ప్రయాణం రద్దు చేయాలి' .. హైకోర్టులో పిటిషన్
X
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించింది. మహాలక్ష్మీ పేరుతో ప్రారంభించిన ఈ పథకాన్ని.. రాష్ట్ర మహిళలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకుుంటున్నారు. ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, దూర ప్రయాణాలకు.. ఆర్టీసీ బస్సులనే తమ ప్రయాణానికి వినియోగిస్తున్నారు. దీంతో ప్రతీ ఆర్టీసీ బస్సు మహిళలతోనే కిటకిటలాడుతున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు.. ఇలా అన్నీ చోట్లా 'మహాలక్ష్మీ'లే దర్శనమిస్తున్నారు. కొన్ని చోట్ల.. సీట్లు విషయంలో ఒకరినొకరు జట్లు పట్టుకొని, కొట్టుకున్న సందర్భాలు లేకపోలేదు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే.. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఓ ప్రైవేట్ ఉద్యోగి. మహిళలకు ఉచిత ప్రయాణం పేరుతో రేవంత్ సర్కార్ గత ఏడాది డిసెంబరు 8న జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ.. హైదరాబాద్ నగరంలోని నాగోల్‌కి చెందిన ఎ.హరేందర్ కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జీవో 47 లింగ వివక్షకు దారి తీస్తుందంటూ.. ‘‘కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది వివక్షతో కూడిన నిర్ణయం. ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి’’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో మహిళలు పోటెత్తడంతో టికెట్ కొన్న పురుషులకు సీట్లు దొరకట్లేదని పిటిషన్ లో తెలిపాడు. ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.