ఓ సాధారణ రైతు కొడుకు..నేడు హైదరాబాద్‌లోనే 6వ రిచ్చెస్ట్ పర్సన్
X
ఓ సాధారణ రైతు కొడుకు. కానీ అతను సాధించిన విజయం మాత్రం అసాధారణం. 35 సంవత్సరాల క్రితం ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ చిన్న కంపెనీని ప్రారంభించి ఇప్పుడు ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించారు.' ఇంపాజిబుల్ ఈజ్ నథింగ్ 'అనే సామెతను విశ్వసించి అసాధ్యాలను సైతం సుసాధ్యాలుగా మార్చి దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు , ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పిపి రెడ్డి. నీటిపారుదల, విద్యుత్, చమురు , గ్యాస్, తాగునీరు , పునరుత్పాదక శక్తి వంటి రంగాలలో దేశ , విదేశాలలో అతిపెద్ద ప్రాజెక్టులను నెలకొల్పి అంచలంచలుగ ఎదిగారు. దాదాపు రూ. 26,700 కోట్ల మేరా ఆస్తులను కలిగిన పీపీ రెడ్డి హైదరాబాద్‌లోని టాప్ 10 సంపన్నులలో స్థానాన్ని దక్కించుకున్నారు. రైతు బిడ్డగా పుట్టి వ్యాపారవేత్తగా ఎదిగే ప్రయాణం చాలా క్లిష్టమైనది. అయితే ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పమే పిపిరెడ్డిని నిరంతరం ముందుకు నడిపిస్తోంది.
1989లో కంపెనీ స్థాపన :
తెలంగాణ కేంద్రంగా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు MEIL కంపెనీ ఛైర్మన్ పీపీ రెడ్డి ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. 1989 లో మెగా ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఇద్దరు ఉద్యోగులతో ప్రారంభించారు. అప్పట్లో చిన్న చిన్న టౌన్లలో పైపుల నిర్మాణాల పనులను కంపెనీ చేసేది. అనంతరంప్రభుత్వానికి చెందిన చిన్నచిన్న కాంట్రాక్ట్ వర్కులను నిర్వహించేవారు. అనంతరం రోడ్ల నిర్మాణం, డ్యామ్స్, సహజ వాయువు, విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వంటి అనేక ఇతర రంగాల్లోకి కంపెనీ విస్తరించింది. అలా మౌలిక సదుపాయాల నిర్మాణ రంగంలో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా నిర్మించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతే కాదు పీపీ రెడ్డీస్ కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది, ఇది గోదావరి నది నుండి తెలంగాణలోని పొడి ప్రాంతాలకు ప్రతిరోజూ 5.7 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేస్తోంది. అదే విధంగా దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన తెలంగాణలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మిషన్ భగీరథను సక్సెస్ ఫుల్ గా నిర్మించింది ఈ సంస్థనే. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో కరవు దూరం కావటంలో వ్యవసాయం అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తోంది.
బిలియనీర్ల జాబితాలో పీపీ రెడ్డి :
దేశంలో అగ్ర వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ కుటుంబం ఆస్తుల విలువ 150 బిలియన్ డాలర్లు. ఈయన కుబేరుల జాబితాలో మెుదటి స్థానంలో నిలిచారు. పీపీరెడ్డి 4.1 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ లో అత్యంత సంపన్నుల జాబితాలో 43వ స్థానంలో నిలిచారు.
"నేను కంపెనీని ప్రారంభించినప్పుడు, విజయం కోసం ఆరాటపడలేదు. మరేమి మరేమీ ఆలోచించలేదు. నా ఏకైక లక్ష్యం కంపెనీని అభివృద్ధి చేయడం మాత్రమే. నా కుటుంబానికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి వ్యాపారంలో సవాళ్లు ఉంటాయి. కానీ వాటిని అధిగమించాలంటే మాత్రం కష్టపడి పని చేయాలి, క్లయింట్‌లతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి . క్లయింట్ సంతృప్తిపై రాజీ పడకుండా ప్రతి అడ్డంకి ఓ మార్గాన్ని కనిపెట్టాలి. ఇదే వ్యాపారంలో చాలా ముఖ్యమైనది. ఇది చాలా కష్టతరమైన వ్యాపారం, కానీ మీరు కష్టపడి పని చేస్తే , నిజాయితీగా ఉంటే కచ్చితంగా విజయం సాధించవచ్చు. మేము భారతదేశంతో పాటు విదేశాలలో కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్‌లను చేస్తున్నాము . క్లయింట్ కోరుకున్నది ఖచ్చితంగా అందిస్తాము. మేము ఎక్కువగా ప్రభుత్వ ప్రాజెక్టులను చేస్తుంటాము. కేంద్రం , రాష్ట్రం నుండి వచ్చిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి అందించడం వల్లనే మేము ఈ రంగంలో రాణించగలిగాము. ఒక ప్రాజెక్ట్‌ను సమయానికి, క్లయింట్ అవసరానికి అనుగుణంగా పూర్తి చేయడం వల్ల కలిగే సంతృప్తి అపారమైనది".అని పీపీ రెడ్డి అంటారు.