నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్
కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
X
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు డిమాండ్ చేస్తూ.. అఖిల భారత విద్యార్థి సంఘం (ఏబీవీపీ) నేడు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. అలాగే ఖాళీగా ఉన్న టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు వెంటనే బుక్స్ పంపిణీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో 15వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘మన బడి, మన ఊరు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వెంటనే అందజేయాలని, మౌలిక వసతులు కల్పించాలని, డీఎస్సీ, ఎంఈవో పోస్టులకు సంబంధించిన ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. గుర్తింపు లేకున్నా నడిపిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ధరకు పుస్తకాలు అమ్ముతున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.