కదనభేరికి కదిలిన విద్యార్థి.. కేసీఆర్ సర్కారుకు హెచ్చరిక
X
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కదనభేరి సభ పేరుతో ఏబీవీపీ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభ విజయవంతం అయింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు, విద్యార్థులు భారీగా ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ విద్యార్థులు దగా పడ్డారని, అందుకే ఈ కదన భేరి నిర్వహించినట్లు ఏబీవీపీ ప్రకటించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా హాజరయ్యారు. వీరితో పాటు సంస్థాగత కార్యదర్శి ఆశిష్ మిశ్రా, జాతీయ కార్యదర్శి అకింత పవార్, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ కూడా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో మూతబడిన 8,624 స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
వీటితో పాటు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సూచించింది. రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్, పేపర్ల లీకేజీ మాఫియా నడుస్తోందని, నిరుద్యోగులు, విద్యార్థులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో విద్యార్థులే కేసీఆర్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తగా కార్పొరేట్ కాలేజీల హవా నడుస్తుందని, వాటిని తెలంగాణ పులిమేరనుంచి తరిమి కొట్టే రోజొచ్చిందని తెలిపారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని.. లేదంటే ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.