శివ బాలకృష్ణ కేసు.. ఫ్లాట్ కొన్న డబ్బులు సీజ్..
X
రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. తాజాగా ఆయన ఫ్లాట్ కొన్న డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది. శ్రీ కృష్ణ కన్స్ట్రక్షన్ సంస్థలో శివ బాలకృష్ణ రూ.2.70 కోట్లు పెట్టిన ఫ్లాట్ కొన్నాడు. కొన్ని నెలల క్రితం ఈ డబ్బు చెల్లించినట్లు గుర్తించిన ఏసీబీ.. దానిని సీజ్ చేసింది. అదేవిధంగా ఆయన ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనేదానిపై ఆరా తీస్తోంది. మరోవైపు ఇదే కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించనుంది. ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ.. నోటీసులు ఇచ్చి విచారించేందుకు రెడీ అయ్యింది.
శివ బాలకృష్ణ ఆస్తులు తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. సుమారు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణకు 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, వివిధ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలోని 7ఫ్లాట్లు, ఒక విల్లా ఉన్నట్లు విచారణలో తేలింది. ఇక బాలకృష్ణ బినామీలపై కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. అతడి సోదరుడు నవీన్ కుమార్పై భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. జనగామ, గజ్వేల్, యాదాద్రి ప్రాంతాల్లో నవీన్, అరుణ దంపతులపై భూముల ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా అతని బినామీలైన సత్యనారాయణ మూర్తి, పెంటా భరత్లను అధికారులు విచారించి.. పలు కీలక విషయాలు సేకరించారు. హెచ్ఎండీఏ డైరెక్టర్గా శివబాలకృష్ణ మూడేళ్లు పనిచేశారు. ఈ సమయంలో 120కి పైగా అనుమతులు జారీ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. శంషాబాద్, ఘట్ కేసర్, శంకర్ పల్లి జోన్లో 120కి పైగా అనుమతులు ఇచ్చినట్లు తేల్చారు. ఈ క్రమంలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ డాక్యమెంట్లను అధికారులు పరిశీలించారు. అతడి ఫోన్లు, ల్యాప్టాప్ల నుంచి కీలక విషయాలను సేకరిస్తున్నారు. గత పదేళ్లలో 15 ఫోన్లు మార్చినట్లు గుర్తించారు.