shiva balakrishna : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
X
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఏసీబీ ప్రస్తావించింది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ భారీగా ఆస్తులు, బినామీల గుర్తించింది. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో బాలకృష్ణ ఇంట్లో 50 స్థిర, చరాస్తుల డాక్యుమెంట్లు సేకరించినట్లు తెలిపింది. వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సోదాల్లో రూ.99 లక్షల నగదు, 4 కార్లు సీజ్ చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్, ఫోన్లు సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో వివరించింది.
155 డాక్యెమెంట్ షీట్స్, 4 బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వివరించింది. వీటికి సంబంధించి బినామీలను విచారించాల్సి ఉందని రిపోర్టులో స్పష్టం చేసింది. కాగా ఈ నెల 25న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. అంతకుముందు రోజు బాలకృష్ణ బంధువులు సహా ఆయనకు ఆస్తులు ఉన్న పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఆయనకు భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.