Home > తెలంగాణ > గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు

గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు

గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు నమోదు
X

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును టేకోవర్ చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు. కేసు దర్యాఫ్తును మొదలు పెట్టామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విచారిస్తామని వివరించారు. గొర్రెల పంపిణీదారుల పేరుతో అధికారులు నిధులు స్వాహా చేశారని ఏసీబీ గుర్తించింది. వాటిని నకిలీ ఎకౌంట్లలోకి మళ్లించినట్టు తేల్చారు. 133 యూనిట్లకు చెల్లించాల్సిన నిధులు పక్కదారి మళ్ళినట్లు గుర్తించారు. దీనిపై విచారణకు దిగిన ఏసీబీ అధికారులు మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో సోదాలు చేయగా..

కీలక కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు మాయమైనట్టు గుర్తించారని సమాచారం. కొన్ని కీలక ఫైళ్లు కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. మొత్తంగా రూ.2.20 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. గొర్రెల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులలో ముందుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వారిని విచారిస్తారని అధికార వర్గాల సమాచారం. రెండు మూడు రోజుల్లో విచారణ మొదలవుతుందని తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ లో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు కొండాపూర్ కు చెందిన ‘లోలోనా ది లైవ్’ కంపెనీ కాంట్రాక్టర్ సయ్యద్ మొయిద్ కు ఈ స్కాంలో పాత్ర ఉందని తెలుస్తోంది.

Updated : 23 Jan 2024 1:51 PM IST
Tags:    
Next Story
Share it
Top