ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడం వెనక ఎవరి కుట్ర లేదు : అద్దంకి
X
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లను ఖరారు చేసింది. ఈ లిస్ట్లో అద్దంకి దయాకర్ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ పక్కా అని ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ను ప్రకటించడంతో దయాకర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ అంశంపై అద్దంకి స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
తనకు ఎమ్మెల్సీ టికెట్ రాకపోవడం వెనక ఎవరి కుట్ర లేదని అద్దంకి అన్నారు. ఎమ్మెల్సీకి మించిన పదవి ఇచ్చేందుకు అధిష్ఠానం ఆలోచిస్తుందేమోనని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందొద్దని సూచించారు. రేవంత్ నాయకత్వంలో ప్రజాపాలన ముందుకు తీసుకపోవడమే తన లక్ష్యమని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు ఆ టికెట్ త్యాగం చేశారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి కూడా ఆయనకు అవకాశం దక్కలేదు.