Prajapalana Program : నేటి నుంచి మళ్లీ ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ
X
రెండు రోజుల విరామం తర్వాత ప్రజా పాలన నేటి నుంచి మళ్లీ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా గ్రామ, వార్డు సదస్సులు ఉంటాయి. ఇప్పటికే 40 లక్షల 57 వేల 952 దరఖాస్తులు రాగా మరో 5 రోజులు ఉండటంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలనకు.. ఆదివారం, న్యూఇయర్ సెలవులతో రెండ్రోజుల విరామం ఏర్పడింది. గతనెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,868 గ్రామాలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారెంటీల పథకాలు సహా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో 40,57,592 దరఖాస్తులు రాగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
తొలి రోజు 7,46,414, రెండో రోజు 8, 12, 862, మూడో రోజు అత్యధికంగా 18 లక్షల 29 వేల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజాలపాలన దరఖాస్తుల్లో గ్యాస్ సిలిండర్, 2,500, గృహ జ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో భారీగా అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. పింఛన్లు, రైతుభరోసా పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.దరఖాస్తుల స్వీకరణ పూర్తైన తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగా ఎంతమందికి అవసరమనే అంచనా వచ్చాక పథకాల అమలు కోసం పూర్తిస్థాయి విధివిధానాలు, నిధుల కేటాయింపుపై కసరత్తు జరిగే అవకాశం ఉంది.మాసబ్ ట్యాంక్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో నేడు జరిగే ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరుకానున్నారు. ఇక ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు జరగనుంది.