Home > తెలంగాణ > Congress: కేసీఆర్‌ అసమర్థత వల్ల రాష్ట్రానికి అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

Congress: కేసీఆర్‌ అసమర్థత వల్ల రాష్ట్రానికి అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

Congress: కేసీఆర్‌ అసమర్థత వల్ల రాష్ట్రానికి అన్యాయం: వంశీచంద్‌రెడ్డి
X

పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క చుక్క కూడా నీరు రాలేదని, ఒక్క ఎకరా కూడా పండలేదని.. కానీ కేసీఆర్ మాత్రం పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేశామంటూ చెబుతున్నారని మండిపడ్డారు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన పాలమూరు ప్రజలను కేసీఆర్ మోసం చేసారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభాలు వివరిస్తామంటూ మేడిగడ్డ వెళ్తామంటున్న బీఆర్ఎస్ అగ్రనేత.. పాలమూరు కి వచ్చి ముక్క నేలకు రాయాలని మండిపడ్డారు.

కాశ్వరంతో తెలంగాణ రైతాంగానికి కలిగిన లాభాన్ని వివరిస్తామని బీఆర్ఎస్ పార్టీ రేపు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో చలో మేడిగడ్డకు పోటీగా టీ కాంగ్రెస్ ‘చలో పాలమూరు-రంగారెడ్డి’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించింది. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీచంద్‌ మాట్లాడుతూ... మరోసారి మోసం చేయడానికే బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటన చేపట్టిందన్నారు. కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుందన్నారు.

కాంగ్రెస్ హయాంలో 262 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటే బీఆర్ఎస్ హయాంలో కేవలం 212 టీఎంసీల నీటినే వాడుకున్నారన్నారు. కృష్ణా జలాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన వాటా తెచ్చుకోలేని అసమర్థుడు కేసీఆర్ అని వంశీచంద్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘రాష్ట్ర ప్రజలను వంచించి కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్‌ ప్రభుత్వం వాడుకోలేదు. ఆయన అసమర్థ నాయకత్వంతో కృష్ణా నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం పాలమూరు, మేడిగడ్డను బొందపెట్టింది. మరోసారి మోసం చేయడానికే ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ పర్యటనకు బయల్దేరారు. శుక్రవారం పాలమూరులో గత ప్రభుత్వ బండారం బయటపెడతాం’’ అని వంశీచంద్‌రెడ్డి చెప్పారు.

Updated : 29 Feb 2024 9:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top