సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపు.. సత్తా చాటిన ఐఎన్టీయూసీ
X
సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా ఎగిరింది. సింగరేణి గుర్తింపు సంఘంగా సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ అవతరించింది. 11 డివిజన్లలో 6 డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ గెలిపొందగా.. ఐదింట ఏఐటీయూసీ జెండా ఎగరేసింది. అయితే ఓవరాల్ ఓట్లలో ఐఎన్టీయూసీపై ఏఐటీయూసీ సుమారు 2వేల ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టింది. దీంతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా.. ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా నిలిచాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం, రామగుండం-2 ఏరియాల్లో ఏఐటీయూసీ సత్తా చాటింది. కొత్తగూడెం, కార్పొరేషన్, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం ఏరియాల్లో ఐఎన్టీయూసి విజయం సాధించింది.
సింగరేణి ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగరడంతో ఏఐటీయూసీ సంబరాల్లో మునిగిపోయింది. గత ఎన్నికల్లో ఒక్క డివిజన్లో గెలవని ఐఎన్టీయూసీ ఈ సారి 6 స్థానాల్లో సత్తా చాటడఃం గమనార్హం. ఇక గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ ఈసారి ఒక్క చోటా కూడా ప్రభావం చూపలేకపోయింది. మణుగూరులో ఏఐటీయూసీపై ఐఎన్టీయూసీ కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ రీ కౌంటింగ్‌కు ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేయగా, ఆఫీసర్లు అంగీకరించలేదు. కాగా అంతకుముందు సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 5గంటల వరకు కొనసాగింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో 94 శాతం పోలింగ్ నమోదైంది.