Akunuri Murali: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తప్ప.. ఏ పార్టీకైనా ఓటేయండి: ఆకునూరి మురళి
X
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల కలలను.. వేల కోట్ల కుంభకోణాలతో కేసీఆర్ కుటుంబం తన్నుకు పోయిందని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణాకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చిందని మండిపడ్డారు. వారి దోపిడీని అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. మేధావులు, విద్యావంతులు ఏకమై కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కోదాడలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓటర్ల చైతన్య యాత్ర మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు విలువ తెలియజేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఓటర్లంతా చైతన్యవంతులై అవినీతి ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని కోరారు. కోదాడలో అన్ని వసతులు ఉన్నా.. హాస్పిటల్ కట్టించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎలక్షన్స్ లో కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాల నుంచి విముక్తి కలుగనుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కాకుండా మిగిలిన ఏ పార్టీకైనా ఓట్లు వేయండని ప్రజలను కోరారు.