Home > తెలంగాణ > 119 సీట్లు.. 2290 మంది అభ్యర్థులు.. అసెంబ్లీ పోలింగ్కు సర్వం సిద్ధం..

119 సీట్లు.. 2290 మంది అభ్యర్థులు.. అసెంబ్లీ పోలింగ్కు సర్వం సిద్ధం..

119 సీట్లు.. 2290 మంది అభ్యర్థులు.. అసెంబ్లీ పోలింగ్కు సర్వం సిద్ధం..
X

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది. ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా.. పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. గురువారం ఉదయం 5.30 గంటలకు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.26కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనుండగా.. వారిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,676 మంది థర్డ్ జెండర్, 15,406 సర్వీస్ ఓటర్లు, ఓవర్సీస్‌ ఓటర్ల సంఖ్య 2,944గా ఉంది.

అసెంబ్లీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటిలో 10 వేలకుపైగా సమస్యాత్మకంగా పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈసారి దాదాపు 2.5లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. భద్రత కోసం దాదాపు 45 వేల మంది పోలీసుల సేవలు వినియోగించుకోనున్నారు. 27,094 కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ నిర్వహించనున్నారు. ఒకేచోట ఎక్కువ సంఖ్యలో కేంద్రాలున్న 7,571 చోట్ల పోలింగ్ స్టేషన్ బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాలను 3,806 సెక్టార్‌లుగా విభజించారు. పోలింగ్‌ బూత్ లలో ఈవీఎంలు పనిచేయకపోయినా, ఇతర సమస్యలున్నా సెక్టార్‌ అధికారులు పరిష్కరించనున్నారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభంకానున్న పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ జరగనుంది.

ఇదిలా ఉంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ బలగాలు భద్రతా విధులు నిర్వర్తించనున్నాయి.


Updated : 29 Nov 2023 6:59 PM IST
Tags:    
Next Story
Share it
Top