రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్
X
ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతులకు ఉచిత కరెంట్ మూడు గంటలు చాలు అని.. 24 గంటలు ఎందుకని రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ భగ్గుమంది. రైతులంటూ కాంగ్రెస్కు చిన్నచూపని విమర్శించింది. ఈ క్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ వల్లే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని క్రాంతి కిరణ్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతాంగం సంతోషంగా ఉందనే వాస్తవాన్ని రేవంత్ తెల్సుకోవాలని సూచించారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని విమర్శించారు. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ ఏ శాస్త్రీయ ప్రాతిపదికన మాట్లాడారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ మోసపూరిత మాటలను నమ్మేస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని క్రాంతి కిరణ్ అన్నారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేస్తోందని.. రైతుల కోసం 4.5 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసిందేమి లేదని.. బీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని క్రాంతికిరణ్ స్పష్టం చేశారు.