తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం
X
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి- శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు. ఆశోక్ , వెంకటమ్మ దంపతులు మరో నలుగురితో కలిసి తిరుమలకు వెళ్లారు. తిరుమల వెంకన్నను దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఆశోక్ ప్రయాణీస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆశోక్, ఆయన భార్య వెంకటమ్మ, మరో చిన్నారి మృతి చెందింది. కారులోని మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో ఏర్పేడు సీఐ శ్రీహరి, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.