బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ మిస్సింగ్
X
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఇంజనీరింగ్ సెకెండ్ ఇయర్ చదువుతున్న మెదక్ జిల్లాకు చెందిన బన్నీ అనే 18 ఏళ్ల విద్యార్థి గత మూడు రోజులుగా కనిపించడం లేదు. బన్నీ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది. ఈ మధ్యనే బన్నీ ఇంటికి కాల్ చేసి పేరెంట్స్‌తో మాట్లాడాడు. ఆ తరువాత నుంచి ఫోన్ స్విచాఫ్ అయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేకపోవడం, స్విచాఫ్ అని వస్తుండటంతో అనుమానంతో బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు బన్నీ పేరెంట్స్. తమ బిడ్డ ఆచూకీ చెప్పాలంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. జులై 6న ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బన్నీ ఔట్‌పాస్ తీసుకున్నాడు. కానీ అతను ఇంటికి వెళ్లలేదు. దీంతో సిబ్బంది సూచనతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బన్నీ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. హాస్టల్ పరిసరాల్లోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బన్నీ క్యాంపస్ నుంచి ఎక్కడికి వెళ్లాడు..? ఎందుకు వెళ్లాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బన్నీ స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నారు. బన్నీ ఆచూకీ కోసం పోలీసులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.