Shivabalakrishna : ఫేక్ ఐటీ రిటన్స్ ఫైల్ చేసినట్లు గుర్తించిన ఏసీబీ..
X
శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ(HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో ఏసీబీ ఇప్పటికే దూకుడు పెంచింది. నిందితుని బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు అధికారులు. దీంతో బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.
బాలకృష్ణకు సంబంధించిన పలు కీలక విషయాలను కనుగొంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన రూ. 2.7 కోట్లు సీజ్ చేశారు. అంతేగాక ఆయన ఫేక్ ఐటీ రిటన్స్ ఫైల్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్లు చూపి ఫేక్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనకు షెల్ కంపెనీలను సృష్టించాడు. షెల్ కంపెనీ ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటన్స్ ఫైల్ చేసినట్లు గుర్తించారు అధికారులు.
శివ బాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్ ఉంది. అలాగే మరదలు అరుణ.. సౌందర్య బోటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెసెస్ పేరుతో నకిలీ సంస్థలను ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అంతేగాక బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో ఐటీ రిటన్స్ ఫైల్ చేశారు. కాగా శివబాలకృష్ణ తమ భూములపై అక్రమంగా అనుమతులు జారీ చేశారంటూ ఏసీబీకి బాధితులు ఫిర్యాదులు అందించారు.