బీజేపీకి మరో కీలక నేత రాజీనామా.. పొమ్మనలేక పొగబెట్టారని..
X
తెలంగాణలో బీజేపీకి ఆ పార్టీ వరుస షాకులు ఇస్తున్నారు. ఇవాళ ఉదయమే మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్లో చేరగా.. తాజాగా మరోనేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. 11ఏళ్లు ఎన్నో అవమానాలను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసినట్లు చెప్పారు. బీజేపీలో ప్రశ్నించే గొంతుకలను పిసికేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సేవను ప్రజలు గుర్తించారు కానీ తమ పార్టీ మాత్రం గుర్తించలేదని రాకేష్ రెడ్డి వాపోయారు. టికెట్ ప్రకటించేటప్పుడు అధిష్టానం తనతో సంప్రదించకపోవడం బాధాకరమన్నారు. కొంతమంది నాయకులు పొమ్మనలేక పొగబెట్టారని ఆరోపించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. కాగా రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి వరంగల్ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పార్టీ ఆ టికెట్ ను రావు పద్మకు ఇవ్వడంతో రాకేష్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెంచుకున్నారు.