Home > తెలంగాణ > బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జగన్ పరామర్శ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జగన్ పరామర్శ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జగన్ పరామర్శ
X

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పరామర్శించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని కేసీఆర్ నివాసంలో జగన్ గులాబీ బాస్‌ను పరామర్శించారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. జగన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి , భాస్కర్ రెడ్డి, రఘురాం ఉన్నారు. అంతకుముందు బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి జగన్ కు స్వాగతం పలికారు

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవెల్లి పాంహౌస్ లో కేసీఆర్ బాత్ రూమ్ లో జారి పడ్డారు. డిసెంబర్ 8వ తేదీన యశోదా ఆసుపత్రిలో కేసీఆర్‌కు తుంటి మార్పిడి చికిత్స జరిగింది. ఈ సర్జరీ జరిగిన తర్వాత కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సర్జరీ తర్వాత కేసీఆర్ ను పరామర్శించేందుకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైద్రాబాద్ కు వచ్చారు. జగన్ తన నివాసం వద్ద కారు దిగగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన స్వాగతం పలికి, తన నివాసంలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీశారు. శస్త్ర చికిత్స తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై కేసీఆర్, జగన్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ చర్చల తర్వాత కేసీఆర్ నివాసంలోనే జగన్ మధ్యాహ్న భోజనం చేస్తారు. భోజనం తర్వాత బేగంపేటకు చేరుకుని తిరిగి విజయవాడకు తిరుగుపయనమవుతారు జగన్. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కెసిఆర్ తో జగన్ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated : 4 Jan 2024 12:25 PM IST
Tags:    
Next Story
Share it
Top