మిడ్ నైట్ గర్ల్స్ హాస్టల్‌లో దారుణం.. అతని పనేనా
X
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ తో .. హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన దారుణం.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ వార్త పత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్సీ కవిత ఇవాళ(ఆదివారం) సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడంతో .. ఈ విషయమంతా నెట్టింట వైరల్ గా మారింది. స్పోర్ట్స్ స్కూల్ లోని గర్ల్స్ హాస్టల్‌లో అర్ధరాత్రి వేళ ఓ అధికారి మకాం వేయడం సర్వత్రా అందోళనలకు దారి తీస్తోంది. స్కూల్‌లోని బాలికలపై సదరు అధికారి కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో వారి తల్లిదండ్రులకు షాక్ కు గురవుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లోని బాలికలపై ఓ అధికారి గత కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత వారి గదుల్లోకి అక్రమంగా చొరబడి అసభ్య చేష్టలకు తెగబడుతున్నాడని, సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడని సమాచారం. అంతేకాదు.. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్కూల్‌లోని బాలికలు.. చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. జరిగిన పరిస్థితిని తెలియజేయాలని, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని అంటున్నారట. ఉన్నతాధికారుల అండదండలతోనే సదరు అధికారి తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ఊరుకునేదే లేదు
అయితే ఈ ఘటనపై మీడియాలో వరుస కథనాలు రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధితురాళ్లకు న్యాయం చేయాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కోరారు. స్పదించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి( ఓఎస్డీ హరికృష్ణ)ని తక్షణమే సస్పెండ్ చేసినట్లు సమాచారం. బాలికలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి పరిపాలనలో మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బయటకు చెప్పకపోవడానికి కారణమదే
ఇప్పటికే వివిధ క్రీడల్లో మంచి ప్రతిభ కలిగి, పతకాలూ సాధించి ఉండటం, భవిష్యత్తులో పాల్గొనాల్సిన క్రీడలకు సంబంధించిన శిక్షణ నడుస్తుండటంతో సదరు అధికారి పాల్పడుతున్న లైంగిక వేధింపులను బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారి దుశ్చేష్టలపై స్పోర్ట్స్ అథారిటీకి చెందిన ఉన్నతాధికారులకు ఇప్పటికే ఫిర్యాదు వెళ్లింది. కాగా సదరు అధికారికి ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటం, ఉద్యోగుల సంఘంలోనూ ఆయన కీలకంగా ఉండటంతో ఇప్పటి వరకు చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేశారట.