టీ కాంగ్రెస్లో ముసలం పుట్టించిన ఎమ్మెల్సీ పదవులు.. కీలక నేత రాజీనామా!
X
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాంగ్రెస్‌లో ముసలం పుట్టించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ చార్జ్ మహమ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అజారుద్దీన్.. పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేయడం కాస్త దెబ్బ తీసే విషయమే. కాగా ఇటీవల కాంగ్రెస్ ప్రతిపాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అయితే కాంగ్రెస్ పెద్దలు గవర్నర్ కోటాలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాటిచ్చారని, కానీ ఇప్పుడు వేరే వారికి పదవిని కట్టబెట్టడంపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా.. అమీర్ అలీఖాన్ లాంటి వారికి పదవి ఇవ్వడం ఏంటని అజార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే టీ కాంగ్రెస్ నేతలు అజార్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినా.. తాను మాత్రం రాజీనామా చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. కాగా అజారుద్దీన్ రాజీనామా చేసిన అనంతరం ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సిద్ధంగా ఉన్నాయి.