ముగిసిన బీఏసీ మీటింగ్.. ఈసారి అసెంబ్లీ ఎన్ని రోజులంటే..
X
అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. భేటీలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న అంశంతో పాటు పలు విషయాలపై చర్చించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. బీఏసీ మీటింగ్ కు ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.
3 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఎక్కువ రోజులు సభ నిర్వహించాలని కోరారు. కనీసం 10 రోజుల పాటు సభ నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అయితే పని దినాలు కాకుండా పని గంటలను చూడాలని మంత్రి హరీష్ రావు చెప్పినట్లు సమాచారం. సమావేశాల్లో భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించాలని నిర్ణయించారు. ఈసారి సమావేశాల్లో ప్రభుత్వం దాదాపు 10 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. 4న (శుక్రవారం) వరదలపై, 5న బిల్లులపై సభలో చర్చ జరగనుంది. ఆదివారం రోజున సమావేశాలు ముగియనున్నాయి. అయితే చివరి రోజున అవసరమనుకుంటే బీఏసీ మరోసారి సమావేశమై సభను పొడగించడంపై నిర్ణయం తీసుకోనుంది.