Balka Suman : నేపాల్ పారిపోయినట్లు ప్రచారం.. బాల్క సుమన్ క్లారిటీ
X
(Balka Suman)బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవంత్ దూషించడంతోపాటు చెప్పు చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు సహా బండి సంజయ్ వంటి వారు ఖండించారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన నేపాల్ పారిపోయారంటూ ప్రచారం జరిగింది. ఖాట్మాండులోని డ్యాన్సింగ్ యాక్ పబ్లో ఆయన్ను గుర్తించారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై బాల్క సుమన్ స్పందించారు.
తాను ఎక్కడికి పారిపోలేదని బాల్క సుమన్ చెప్పారు. నేపాల్ పారిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తెలంగాణ భవన్ లోనే ఉన్నట్లు వివరించారు. ‘‘ నిన్న ఉదయం నుంచి తెలంగాణ భవన్లోనే ఉన్నాను. నాపై పెట్టిన కేసులకు సమాధానం ఇస్తాను. పోలీసులు విచారణకు రమ్మంటే వెళ్తాను. కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇకపై అసత్య ప్రచారాలు చేయకండి ’’ అని ఆయన తెలిపారు.
కాగా కేసీఆర్‌ను రం.. అన్న రేవంత్ రెడ్డే పెద్ద రం.. అని బాల్క సుమన్ అసభ్య పదజాలంతో దూషించారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉందని.. కానీ సంస్కారం అడ్డువస్తుందని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన చెప్పును సైతం చూపించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన కాంగ్రెస్ నేతల మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేశారు.