బండి సంజయ్కు కీలక పదవి
X
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురు నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ కార్యదర్శులుగా ఏపీకి చెందిన సత్యకుమార్ యాదవ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌ను కొనసాగించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు బీజేపీ ప్రకటించింది.
ప్రధాన కార్యదర్శిగా నియమించిన బండి సంజయ్ ను ఏదైనా రాష్ట్రానికి ఇంఛార్జిగా నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ ఇటీవలే ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో బండికి ఏం పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కార్యకర్తల్లో అసంతృప్తిని తగ్గించేందుకే పార్టీ పెద్దలు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి కీలక పదవి ఇచ్చినట్లు సమాచారం.