మునిగిపోయే నావలో వెళ్లేవాళ్లను మేం ఆపబోం: బండి సంజయ్
X
బీజేపీ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ లీడర్ల మధ్య విభేదాలు, కొందరు లీడర్లు పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మిడియా అడిగిన ప్రశ్నలకు బండి సమాధానం ఇచ్చారు. ‘పార్టీ మార్పు ఆలోచన అనేది వాళ్ల వ్యక్తిగతం. వాళ్ల రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా వాళ్లు కదులుతారు. అయినా, మునిగిపోయే నావలో వెళ్తామంటే మేమెందుకు వద్దంటాం. అయినా, మా పార్టీ నుంచి ఎవ్వరూ పార్టీ మారట్లేద’ని బండి సంజయ్ స్పష్టం చేశారు.
డిపాజిట్లు రాని అభ్యర్థులున్న పార్టీలోకి ఎవరు వెళ్తారని బండి అన్నారు. ఎలక్షన్స్ వస్తుంటే కేసీఆర్ కు అమరవీరులు గుర్తొచ్చారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఏరోజూ అమరవీరులకు కనీసం జోహార్ చెప్పని కేసిఆర్.. నిన్న అమర జ్యోతి ప్రారంభించడంపై మండిపడ్డారు. కేసీఆర్ చెప్తోన్న అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి అన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావాలని అధికారులు, నేతలు, మహిళలను బెదిరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.