ఆ నలుగురి కోసమే రాష్ట్రం ఏర్పడినట్టుంది - బండి సంజయ్
X
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరిచారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని అన్నారు. 9ఏండ్ల కాలంలో రాష్ట్రానికి కేంద్రం 4 లక్షల కోట్ల నిధులు విడుదల చేసిందని చెప్పారు.
రాష్ట్రంలో మూర్ఖపు పాలన
రాష్ట్రంలో మూర్ఖపు పాలన కొనసాగుతోందని బండి అన్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందని అన్నారు. రాష్ట్ర సాధన ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదన్న బాధతో ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజ్ రీయింబర్స్మెంట్ ముందుగానే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు.
ఫసల్ బీమా అమలు
రూ.10వేల పంట నష్టం పరిహారం ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని బండి మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఫసల్ బీమాను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తుండటంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని అన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గల్లంతయ్యారని బండి సంజయ్ అన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన పార్టీ కాంగ్రెస్ అంటూ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనన్న బండి.. రాష్ట్రాభివృద్ధికి మోడీ సహకరిస్తున్నా కేసీఆర్ అందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఒక కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించేందుకే రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.