రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం నాకు చేతకాదు : బండి సంజయ్
X
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్‌రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదన్నారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం, సోషల్ మీడియాలో సొంత పార్టీ నేతలను తిట్టించడం వంటివి తన వల్ల కావని చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నాడో జానారెడ్డి, కోమటిరెడ్డి, జాగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. బీజేపీలో సీనియర్లు నాయకులు బాస్లు అయితే.. అదే కాంగ్రెస్లో హోంగార్డ్స్ అని సెటైర్ వేశారు.
తమకు పార్టీ నడపరాకుంటే హుజురాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా గెలిచామని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ గెలుపు పరంపర కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ ఓటమి పరంపర సాగిస్తోందని విమర్శించారు. అదేవిధంగా బీఆర్ఎస్పై కూడా సంజయ్ విరుచుకపడ్డారు. రాష్ట్రంలో మూర్ఖపు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర సాధన ఆకాంక్షలు ఇప్పటికీ నెరవేరలేదన్న బాధతో ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదని.. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగరేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు. జెండా ఎగరవేయనందుకు కేసీఆర్‌కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లీంలకు ఇస్తాం’’ అని బండి సంజయ్ అన్నారు.