కేసీఆర్ క్యాన్సర్ కంటే డేంజర్ : బండి సంజయ్
X
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. క్యాన్సర్ కంటే కేసీఆర్ డేంజర్ అని అన్నారు. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో.. కేసీఆర్
మూడోసారి సీఎం అయితే అతకంటే డేంజర్ అని చెప్పారు. మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేశాడని.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని.. మూడోసారి వస్తే ఇక అంతేనని విమర్శించారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా దండు పాళ్యం ముఠాను పోలి ఉందని ఎద్దేవ చేశారు.
ఎమ్మెల్యే పార్టీ మారకుండే ఉండేందుకే ముందుగా అభ్యర్థులను ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. వీళ్లందరినీ ఎలక్షన్ వరకు పెక్కన పెట్టుకొని చివర్లో సగం మంది టికెట్లు ఇవ్వరని తెలిపారు. కాంగ్రెస్‌లోనే 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు కేసీఆరే పంపించారని.. గెలవగానే వాళ్లు బీఆర్ఎస్‌లోకి జంప్ అవుతారని పేర్కొన్నారు. గెలిచినా పార్టీ మారనోళ్లు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేలని బండి సంజయ్ వెల్లడించారు.
దళితులకు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం, కేసీఆర్ కుటుంబానికి 30 శాతం లాగేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు.