బండ్ల గణేశ్ డ్రైవర్ భార్య బలవన్మరణం..
X
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్లో జీవనం సాగిస్తున్నారు. కానీ చిన్న విషయంలో తలెత్తిన గొడవ ఊహించని పరిణామాలకు దారితీసింది. భర్తపై కోపంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోప తండాకు చెందిన రమణకు ఖమ్మం జిల్లా పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)కు కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. బంజారాహిల్స్ ఇందిరానగర్ లోని ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. రమణ సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చన్నీళ్లకు వేన్నీళ్లు అన్నట్లు చందన ఓ జ్యూయెలరీ షాపులో విధులు నిర్వహిస్తోంది.
అన్యోన్యంగా సాగుతున్న రమణ, చందన కాపురంలో ఓ చిన్న గొడవ పెద్ద దుమారం రేపింది. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. సోమవారం ఉదయం రమణ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిపోయాడు. చందన పలుమార్లు అతనికి వీడియోకాల్స్ చేసినా అతను పట్టించుకోలేదు. చివరకు కాల్ లిఫ్ట్ చేయడంతో కావాలనే తనతో గొడవపడుతున్నావంటూ ఏడ్చింది. చనిపోతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది.
చందనకు తిరిగి ఫోన్ చేసినా ఎత్తుకపోవడంతోరమణ వెంటనే ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. వారు రమణ ఉంటున్న పోర్షన్కు వెళ్లారు. చందన ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే చందన ఉరేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రమణను అదుపులోకి తీసుకున్నారు. చందన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.