కొడవళ్లతో దాడి.. FRO హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
X
ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మడకం తుల, మిడియం నంగాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవితఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. గతేడాది చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు నరుకుతుండగా అడ్డుకున్న ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావును అదే గ్రామానికి తుల, నంగాలు వేట కొడవళ్లతో దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. 2022లో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు గురైన విషయం తెలిసిందే.
2022 నవంబర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బెండలపాడు అటవీ ప్రాంతంలో అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. అటవీ భూములను రక్షించేందుకు వెళ్లిన ఆయనపై.. గుత్తికోయలు కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తోటి అధికారులు హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయించింది. ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఇంటి స్థలం, ఆర్థిక సహాయంతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌గా శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం రూ.50,00,000 ఆర్థిక సాయం కూడా అందజేసింది. అటవీ శాఖ అధికారుల భద్రత కోసం ఆయుధ సంపత్తిని పెంచడంతో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు.