Medaram Jatara: మహిళలకు ఫ్రీ బస్.. చార్జీలు వసూలు చేద్దామంటున్న సజ్జనార్.. వద్దంటున్న భట్టి
X
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలకు రవాణా సౌకర్యాలు సులబతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణ సౌకర్యం ఉంది. రాష్ట్రంలో ఏ మూలకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులు బాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే మేడారం జాతర నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్ ఉంటుందా? ఉండదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదిస్తున్నారు. మేడారంకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే సంస్థ ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో కూడా ఉచిత బస్సు సర్వీస్ కల్పిస్తే సంస్థకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని ఆయన వాదన.
అయితే డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఇది సరికాదని, ఎట్టి పరిస్థితిలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్క మేడమే కాకుండా.. రాష్ట్రంలోని ఏ జాతర సమయంలోనైనా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కల్పించాలని, ఎవరి వద్ద నుంచి టికెట్ డబ్బులు వసూలు చేయొద్దని ఆదేశించారు. దీనికయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కాగా ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కాబోయే మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులు నడపనుంది.