షర్మిల కాంగ్రెస్లోకి వస్తే తప్పేంటి..? : భట్టి
X
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరుతారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కర్నాటక ఎన్నికల ఫలితం తర్వాత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఆమె కలవడంతో ఈ ప్రచారానికి తెరలేచింది. ఇటీవల రాహుల్ గాంధీకి ఆమె బర్త్ డే విషెస్ చెప్పడం ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీని విలీనం చేస్తారనే వార్తలు సైతం వచ్చాయి. అయితే షర్మిల మాత్రం అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్లో చేరడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే తప్పేంటని భట్టి ప్రశ్నించారు. ‘‘పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువులుగా ఉండి తిట్టిన వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి పనిచేస్తున్నారు. అలాంటిది షర్మిలను పార్టీలోకి తీసుకుంటే తప్పేంటి. వైఎస్ షర్మిల కుటుంబానిది మొదటి నుంచి కాంగ్రెస్సే. కొన్ని అనివార్య కారణాల వల్ల వారు పార్టీకి దూరమయ్యారు. షర్మిలను కాంగ్రెస్‌లోకి వద్దు అనే వాళ్లది వ్యక్తిగత అభిప్రాయం’’ అని భట్టి అన్నారు.
కొన్నిరోజులుగా షర్మిల ప్రచారం కాంగ్రెస్ లో సైలెంట్ అయినా భట్టి వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిజంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లోకి వీలినం చేస్తారా.. ఒకవేళ విలీనం చేస్తే.. ఆమె ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా.. లేక తెలంగాణ నుంచా అనేది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.