Home > తెలంగాణ > కేసీఆర్ ఆచరణ దళితులకు బాసట.. సీఎంతో భీమ్ ఆర్మీ చీఫ్ భేటీ...

కేసీఆర్ ఆచరణ దళితులకు బాసట.. సీఎంతో భీమ్ ఆర్మీ చీఫ్ భేటీ...

కేసీఆర్ ఆచరణ దళితులకు బాసట.. సీఎంతో భీమ్ ఆర్మీ చీఫ్ భేటీ...
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రశంసించారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నంత గొప్పగా గురుకుల విద్య దేశంలో మరెక్కడా అమలు కావట్లేదు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ బిడ్డలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించే మహోన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వందలాది గురుకులాలు ప్రపంచ జ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న 'దళితబంధు' సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుంచి ఆత్మ గౌరవం దిశగా కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉంది. ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ విషయం’’ అని అన్నారు. చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

దేశంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారు. కొన్ని శక్తులు కులం పేరుతో మనుషులను విభజిస్తూ, సామాజిక వివక్షకు గురిచేస్తూ దమనకాండ సాగిస్తున్నాయని చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. దళితబంధు పథకం దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో అమలవుతున్న పథకమని కొనియాడారు. దళితబంధు లబ్ధిదారుల విజయగాథలను తాను తెలుసుకున్నానని, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు ప్రారంభమైందని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం కేసీఆర్‌కు అంబేద్కర్ పట్ల ఉన్న అభిమానానికి, వారి ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. భేటీ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదిరులు భీమ్ ఆర్మీ చీఫ్‌ను కలుసుకున్నారు.

Updated : 28 July 2023 5:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top