ప్రవళిక కేసులో ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన శివరాం..
X
ఇటీవల అశోక్ నగర్లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరాం అనే యువకుడు నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. లొంగిపోతున్నట్లు కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం అంగీకరించింది. గ్రూప్ 2 వాయిదా వల్లే ప్రవళిక చనిపోయిందని ఆరోపణలు రాగా.. పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని చెప్పారు.
ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. గ్రూప్ 2, డీఎస్సీ వాయిదా వేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు సహా విపక్షాలు ఆరోపించాయి. అయితే శివరామ్ వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవళిక కుటుంబసభ్యులు సైతం శివరాం వేధింపుల వల్లే తమ కూతురు మరణించిందని.. అతడిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
శివరాం రాథోడ్ - ప్రవళిక మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని పోలీసులు చెప్పారు. అతనితో ఆమె చాటింగ్ చేసినట్లు ఆధారాలు లభించాయని.. వాళ్ల ప్రేమ వ్యవహారంఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసని వివరించారు. శివరాం రాథోడ్కు మరో యువతితో ఎంగేజ్మెంట్ అవడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శివరామ్ కోర్టులో లొంగిపోవడం గమనార్హం.