Home > తెలంగాణ > రిజర్వేషన్లలో సంచలనం.. 75 శాతానికి చేరుకున్న కోటా

రిజర్వేషన్లలో సంచలనం.. 75 శాతానికి చేరుకున్న కోటా

రిజర్వేషన్లలో సంచలనం.. 75 శాతానికి చేరుకున్న కోటా
X

బీసీలకు న్యాయం చేసేందుకు ఆ సామాజిక వర్గం జనాభా ఎంతో తేల్చడానికి కులగణన చేపట్టిన బిహార్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జేడీయూ నేత నితీశ్ కమార్ సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50 శాతం వరకు రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిని మరో 10 శాతం పెంచి 65 శాతానికి చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కల్పించిన 10 శాతం కోటాను కూడా కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఓబీసీ, ఈబీసీ వర్గాలకు కలిపి 30 శాతం రిజర్వేషన్‌లు ఉండగా తాజా నిర్ణయంతో మరో 13 శాతం పెరుగుతాయి. ప్రస్తుతం ఈబీసీలకు 18, ఓబీసీలకు 12, ఎస్సీలకు 16, ఎస్టీలకు ఒక శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది.

నిపుణుల అభిప్రాయం తీసుకుని తాజా నిర్ణయాన్ని అమలు చేస్తామని నితీశ్ తెలిపారు. ఓబీసీ మహిళలకు కేటాయించిన 3 శాతం రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తామని వెల్లడించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు న్యాయ సర్వీసులు, ప్రభుత్వ లా కాలేజీలు, యూనివర్సిటీల్లో 10 శాతం కోటా కల్పిస్తామన్నారు. కులగణన డేటాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం కోటాను పెంచింది. తాజా డేటా ప్రకారం రాష్ట్రంలోని 13 కోట్ల జనాభాలో ఈబీసీలు 36 శాతం, ఓబీసీలు 27.1 శాతం, ఎస్సీలు 19.7 శాతం, ఎస్టీలు 1.7 శాతం ఉన్నారు. జనరల్ కేటగిరీ జనాభాగా 15.5 శాతం. ఓబీసీ, ఈబీసీ జనాభా 60 శాతం దాటడంతో కోటా పెంచారు.


Updated : 7 Nov 2023 10:26 PM IST
Tags:    
Next Story
Share it
Top