BJP : బీజేపీకి వాటితోనే రూ.1300 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్కు ఎంతంటే?
X
రాజకీయ పార్టీలకు విరాళాలు భారీగా వస్తుంటాయి. అధికారంలో ఉన్న పార్టీలకు అయితే విరాళాలు వెల్లువెత్తుతాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచి ఆ పార్టీకి విరాళాలు జోరుగా వస్తున్నాయి. 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి సుమారు రూ.1300 కోట్ల విరాళాలు వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి మొత్తం రూ.2120 కోట్ల విరాళాలు అందగా.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే 61 శాతం ఉండడం గమనార్హం. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో బీజేపీ ఈ విషయాన్ని తెలిపింది.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి 7 రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి. ఇక 2021-22లో రూ.1775 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆడిట్ రిపోర్టులో బీజేపీ తెలిపింది. వడ్డీ రూపంలో 2021-22లో రూ.135 కోట్లు, 2022-23లో రూ.237 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించింది. 2022-23లో విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి రూ.78.2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. 2022-23లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయంగా రూ.76.5 కోట్లు, 2021-22లో రూ.146.4 కోట్లు అందించినట్లు తెలిపింది.
మరోవైపు విపక్ష కాంగ్రెస్‌కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.171 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. 2021- 22లో రూ.236 కోట్లు వచ్చాయి. టీడీపీకి 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.34 కోట్ల విరాళాలు వచ్చాయి. 2021-22తో పోల్చితే 10 రెట్లు పెరిగింది. ఇక సమాజ్ వాదీ పార్టీకి 20222-23లో ఎలాంటి విరాళాలు అందలేదు. అంతకుముందు ఏడాది ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.3.2 కోట్లు వచ్చాయి.