తెలంగాణపై స్పెషల్ ఫోకస్.. బండి సంజయ్ను సైడ్ చేస్తారా..!
X
తెలంగాణలో మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్రంపై ఫోకస్ పెంచింది. కర్నాటకలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా వ్యూహాలకు పదను పెడుతోంది. తెలంగాణలో పాగా వేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ తాజాగా రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది. కొత్త కమిటీల ఏర్పాటు ఇప్పటికే ఉన్న వాటిలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. పనిలో పనిగా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే విషయంలోనూ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
దిద్దుబాటు చర్యలు
మిషన్ 90 నినాదంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసింది. కర్నాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు పార్టీలో జోష్ కొనసాగినా.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. భారీగా చేరికలు ఉంటాయని భావించినా అది జరగలేదు. మరోవైపు నేతల మధ్య వర్గపోరు, పార్టీ అధ్యక్షుడిపై కీలక నేతల ఫిర్యాదులు హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. దీంతో దక్షిణాదిలో సానుకూల పనిస్థితులున్నాయని మొన్నటి వరకు భావించిన జాతీయ నాయకత్వం ఇప్పడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
అంతర్గత పోరుపై దృష్టి
కర్నాటక ఎన్నికల్లో ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమన్న అంచనాకు బీజేపీ వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో ఆ సీన్ రిపీట్ కాకుండా చూసుకోవాలని జాగ్రత్త పడుతోంది. నిజానికి కర్నాటకలో పార్టీ అధికారంలో ఉన్నా నేతల మధ్య సమన్వయ లోపం బీజేపీ కొంపముంచింది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా నాయకులు వ్యవహరించడంతో పార్టీ పుట్టి మునిగింది. ప్రస్తుతం తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పాత నాయకులకు కొత్తగా పార్టీలో చేరినవారికి మధ్య సత్సంబంధాలు లేకపోవడం ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. సమన్వయం లేకపోవడం వల్ల అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ ను ఎదుర్కోవడం కష్టంగా మారింది.
మార్పులు చేర్పులు
ప్రస్తుత పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ హైకమాండ్ తెలంగాణలో పార్టీ నాయకత్వంలో భారీ మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి మరీ పార్టీ పెద్దలకు బండిపై కంప్లైంట్ చేయడంతో ఆయనను పదవి నుంచి తప్పించడమే మంచిదన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవడంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది. అయితే తెలంగాణలో పాగా వేయాలంటే అది చాలదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ నేతల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
త్వరలో ప్రకటన
ఇదిలా ఉంటే ఇప్పటికే పలు కమిటీలు ఉన్నప్పటికీ మరికొన్నింటిని కొత్తగా ఏర్పాటు చేసి కీలక నేతలకు వాటి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగా చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటలకు ప్రచార కమిటీ బాధ్యతలు సైతం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ తదితరులకు సైతం కొన్ని కమిటీల్లో భాగస్వాములను చేయాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు బీజేపీలో కేసీఆర్ కోవర్టులున్నారన్న ఆరోపణలపైనా జాతీయ నాయకత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక నేతలు మేథోమథనం చేస్తుండడంతో, అతి త్వరలోనే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వ్యూహాలు, పొత్తులు, కార్యాచరణ ప్రణాళికపై స్పష్టమైన ప్రకటన వెలువడనుంది.