కాంగ్రెస్‌లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి? మునుగోడు నుంచే పోటీలోకి..!
X
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిన్న బీజేపీ రిలీజ్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌లో తన పేరు ప్రకటించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నెల 27న ఢిలీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
గతంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నుంచి మునుగోడు బైపోల్ ఎన్నికలో పోటీ చేసి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. బీజేపీకి దూరంగా వస్తున్న ఆయన.. కొంతకాలం నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు జరిపిన రాజగోపాల్‌రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది.
మరోవైపు రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్‌లో మాదిరిగా బీజేపీలో ప్రాధాన్యత దక్కడం లేదనే భావన కోమటిరెడ్డి అనుచరుల్లో ఉంది. ఈ క్రమంలోనే వారు రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని రాజగోపాల్ రెడ్డినే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీ కాంగ్రెస్‌లో చాలా కీలక భూమిక పోషిస్తున్నారు.