బీజేపీకి మరో షాక్.. పార్టీకి తుల ఉమ రాజీనామా..
X
ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన కీలక మహిళా నేత తుల ఉమ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. తన రాజీనామాకు కారణాలను ఉమ లేఖలో ప్రస్తావించారు. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.
స్థానిక బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన ఉమ పార్టీలో చేరడంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, తుల ఉమ బీజేపీ నుంచి వేములవాడ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ హైకమాండ్ అనూహ్యంగా తులా ఉమకు బదులు వికాస్ రావుకు బీఫాం ఇచ్చింది. స్థానిక నాయకుల అభ్యంతరాల మేరకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో తుల ఉమ జన శక్తి పార్టీలో పనిచేశారు. అప్పుడు బీజేపీ నేతలను టార్గెట్ చేసిన విషయాన్ని వేములవాడకు చెందిన స్థానిక బీజేపీ నేతలు అధిష్ఠానం దృష్టికి తెచ్చారు. మేడిపల్లి మండలానికి చెందిన పార్టీ అధ్యక్షుడు గోరె బాబు మియాతో పాటు ఇద్దరు సర్పంచులను జనశక్తి హత్య చేయడంతో పాటు, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ప్రతాప రామకృష్ణపై కూడా దాడి చేసిన విషయాన్ని వివరించినట్టు సమాచారం. దీంతో బీజేపీ హైకమాండ్ వికాస్ రావు అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.