Vijayashanti: విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్‌పై పోటీ!!
X
సీఎం కేసీఆర్‌పై తనను పోటీ చేయమని తమ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారంటూ ప్రముఖ నటి, బీజేపీ మహిళ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని.. కానీ అధిష్టానం నిర్దిశిస్తే.. తప్పక పోటీ చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
ఆమె చేసిన ట్వీట్ లో.. "బీఆర్ఎస్‌పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కి తగ్గదని కార్యకర్తల విశ్వాసం.. గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను కేసీఆర్‌పై పోటీ చేయాలని మీడియాలో వార్తలు రావడంతో కార్యకర్తలు అడుగుతున్నారు.. అదీ తప్పుకాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాదు.. వ్యుహాత్మక నిర్ణయాలు పార్టీ నిర్దేషితం అని" విజయశాంతి పోస్ట్ చేశారు.
ఎన్నికల నగారా మోగడంతో బీఆర్‌ఎస్ పార్టీ.. అభ్యర్థులను ప్రకటించి.. ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్ కూడా తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కానీ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఆగిపోయింది. దాంతో రాష్ట్రంలో కాషాయ పార్టీ హవా తగ్గింది.. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా లేరనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో విజయశాంతి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ తరఫున అభ్యర్ధులే ఇంకా ఖరారు కాని వేళ ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు.