కాంగ్రెస్ గూటికి వివేక్ వెంకటస్వామి.. ముహూర్తం ఫిక్స్!
X
ఒకపక్క దగ్గర పడిన తెలంగాణ ఎన్నికలు, మరోపక్క కాస్త దగ్గర్లో ఉన్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అసంతృప్త నేతలు, ఆశావహులు పక్క చూపులు చూస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖాయమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 30న(బుధవారం) ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఉండిన వివేక్ 2013లో బీఆర్ఎస్‌లో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరిన ఆయన మళ్లీ పార్టీ మారతారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివేక్ బీజేపీని వదిలితే ఆ పార్టీకి దెబ్బే. కాంగ్రెస్‌కు ఆయనతో కొన్ని సమస్యలు ఉన్నా ఎంపీ టికెట్ విషయంలో ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. వీ6 చానల్, వెలుగు పత్రికలను నిర్వహిస్తున్న వివేక్ హస్తం కండువా కప్పుకుంటే పార్టీకి సొంత పత్రిక, టీవీ చానల్ లేని లోటు ఉండదు.
కేంద్ర మాజీమంత్రి వెంకటస్వామి తనయుడైన వివేక్ 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2013లో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరారు. పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడాక మళ్లీ బీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసీఆర్ ఆయనను పక్కనబెట్టారు. తర్వాత బీజేపీలోకి వెళ్లిన వివేక్‌కు అక్కడా ప్రాధాన్యం లభించలేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్ కోసమే ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.