బీజేపీ అధ్యక్షుడిగా ఈటల.. ఆ ట్వీట్ అర్థం అదేనా!
X
బీఆర్ఎస్‌ను వదిలేసి కాషాయ కండువా కప్పుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కల ఫలించబోతుందా? బీజేపీలో కీలక పదవి ఆశిస్తున్న ఆయన త్వరలోనే అనుకున్నది సాధించబోతున్నారా? అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ బీజేపీని దారిలో పెట్టి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడానికి అధిష్టానం ఆయననే సారథిగా ఎంచుకుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కొన్ని రోజులుగా పార్టీలోనూ, రాజకీయ చర్చల్లోనూ వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని అధిష్టానం మార్చుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు చాన్స్ ఉంటుందని అభిమానులు ఆశతో ఉన్నారు. ఆ ఆశలు నెరవేరబోతున్నట్లు ఈటల పరోక్షంగా విషయమేమిటో చెప్పారు. ‘మీకు అండగా ఉంటా. మోదీ గారి నాయకత్వంలో బీజేపీని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికునిలా పనిచేస్తా’’ అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ఏదో కీలక పదవీ ఆయనకు ఇస్తున్నారని, అందుకే ఆ ట్వీట్ చేశారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అధ్యక్ష పదవి.. లేకపోతే ప్రచార సారథి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరు బాగాలేదని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ పదవికి అప్పగిస్తారని వార్తలు వస్తుండడం, అదంతా బీఆర్ఎస్ ప్రచారమని కమలనాథులు కొట్టేస్తుండడం తెలిసిందే. ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు బండి సంజయ్‌తో పొసగడం లేదని టాక్. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అంతర్గత కుమ్ములాటలు అసలుకే చేటు తెస్తాయని అధిష్టాం వారిని ఢిల్లీకి పిలిపించుకుని సర్ది చెప్పి పంపుతోంది. ఇటీవల ఈటల అస్సాం వెళ్లి రాష్ట్ర సీఎం హిమంతబిశ్వ శర్మతోనూ, తర్వాత ఢిల్లీలో హైకమాండ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనకు ఏ మాత్రం ప్రాధాన్యం లేని చేరిక కమిటీ అధ్యక్ష పదవని అప్పగించడం సరికాదని ఆయన ఇప్పటికే పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన స్థాయికి తగ్గ పోస్ట్ ఇవ్వాలని ఎప్పట్నుంచో కోరతున్నారు. మరోపక్క.. కిషన్ రెడ్డికి కూడా బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవిపై ఆసక్తి లేదని తెలుస్తోంది. దీంతో ఈటలకు ఆ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఈటల్ ఉద్దేశపూర్వకంగా ట్వీట్ చేశారని భావించాల్సింది. రాష్ట్ర చీఫ్ పదవి కాకపోతే ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతనన్న అప్పగించాలని ఆయన ఆకాంక్షగా కనిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ సత్త చాటితే ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలోనూ తనకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
ట్వీట్ ఇదీ...
‘‘భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు.. సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా గెలవాలని నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనేక కష్ట, నష్టాలకోర్చారు. అవమానాలు భరించారు. త్యాగాలు చేశారు. పదవులు లేకపోయినా కాషాయ జెండాపట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది. మోదీ గారి నాయకత్వంలో బీజేపిని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికునిలా పనిచేస్తా. మీకు అండగా ఉంటా...’
Telangana bjp, bjp mla etala rajender tweet, etala rajeder important post, bandi sanjay, kishan reddy, election campaign chief