Home > తెలంగాణ > అసెంబ్లీలో కనీసం మాకు రూమ్ కూడా ఇవ్వలేదు: ఈటల

అసెంబ్లీలో కనీసం మాకు రూమ్ కూడా ఇవ్వలేదు: ఈటల

అసెంబ్లీలో కనీసం మాకు రూమ్ కూడా ఇవ్వలేదు: ఈటల
X

అసెంబ్లీ స్పీకర్ సహా కేసీఆర్, కేటీఆర్‌లపై సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. చట్టసభలపై సీఎం కేసీఆర్‌కు నమ్మకం సన్నగిల్లిందని, దానికి నిదర్శనం ఇటీవల జరిగిన సమావేశాలేనన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు 11 రోజులు, వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఇలా ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే జరిగాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు సమావేశాలు నిర్వహించేవారని చెప్పారు.

జాతీయ పార్టీకి విలువ లేదు

అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే గన్ మెన్స్ రూమ్‌లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు. ‘‘ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంది చట్టాలు చేసేందుకు.. కానీ ఎమ్మెల్యేలను విమర్శలు చేసే వారిని బెదిరించే వారిగా తయారు చేశారు. ఎన్ని రోజులు అయినా చర్చకు సిద్ధం అని చెప్పే ముఖ్యమంత్రి ఎందుకు ఇలా వ్యహహారిస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో13 పార్టీలు ఉన్న బీఏసీకి పిలిచేవారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఉంది కేవలం నాలుగు పార్టీలే.. అందులో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ. ఇలాంటి పార్టీని బీఏసీకి పిలవకపోవడం అంటే ఎంత అక్కసు ఉందో తెలుసుకోవచ్చు.

ఎంఐఎం అడిగితే మాత్రం..

శాసనసభలో ఎమ్మెల్యే కు కన్వెన్షన్ ఉంటాయి.. వాటిని ఎక్కడా స్పీకర్ పాటించలేదు.. అసెంబ్లీలో మేము ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆయన కనీసం మా మొహం కూడా చూడడు. అసెంబ్లీలో కేవలం సీఎం వైపు మాత్రమే చూస్తూ మాకు సమయం కూడా ఇవ్వడు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే అని సీఎం చెబుతాడు. మిత్ర పక్షమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యహరించడం దారుణం. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదు. ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారు. వరదల్లో 41 మంది చనిపోతే అసెంబ్లీలో వారి ప్రస్తావనే లేదు.. కనీసం వారికి సంతాపం కూడా లేదు.

ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం

రానున్న ఎన్నికల్లో 109 సీట్లు వస్తాయని కేసీఆర్‌ అహంకారంతో చెబుతున్నారు. మూడు రోజులు సభ జరిగితే ఒకటో రోజు హరీశ్‌రావు.. రెండో రోజు కేటీఆర్‌.. మూడో రోజు కేసీఆర్‌ ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయింది. బడ్జెట్‌ పెరుగుతోంది.. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. రైతులు తీసుకున్న రుణాలకు రూ.13వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. భూములు అమ్మవద్దని నాడు అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం.. నేడు భూములు ఎలా అమ్ముతున్నారు?. ప్రచారం కోసమే ఎకరా రూ.100కోట్లు అని చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ పడిపోలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నారు. ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాల కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారు. ఎమ్మెల్యేలంటే నియోజకవర్గాల్లో ఉంటూ పోలీసుస్టేషన్లకు ఫోన్‌ చేసే వాళ్లుగా మార్చారు ’’ అని ఈటల ఆరోపించారు.

Updated : 8 Aug 2023 2:32 PM IST
Tags:    
Next Story
Share it
Top