Home > తెలంగాణ > నా గెలుపుతో పార్టీకి ఊపొచ్చింది..కానీ నన్నే పట్టించుకుంటలే..! :రఘునందన్ రావు

నా గెలుపుతో పార్టీకి ఊపొచ్చింది..కానీ నన్నే పట్టించుకుంటలే..! :రఘునందన్ రావు

నా గెలుపుతో పార్టీకి ఊపొచ్చింది..కానీ నన్నే పట్టించుకుంటలే..! :రఘునందన్ రావు
X

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల పర్వం కొనసాగుతూనే ఉంది. అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఓ వైపు ఈటల, రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ నేతలు జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు పార్టీ తీరుపై అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. బీజేపీ అధిష్టానంలో మార్పు రావాలంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేయడం కలకలం రేగగా.. ఇప్పుడు రఘునందన్ రావు బహిరంగాంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు

బీజేపీలో తనకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని రఘునందన్ రావు చెప్పారు. తనను రాష్ట్ర కమిటీతో పాటు కేంద్ర కమిటీ కూడా పట్టించుకోవడంలేదన్నారు. జాతీయ అధికార ప్రతినిధి పోస్ట్ ఇవ్వాలని అడిగినా పట్టించుకోలేదన్నారు. స్వయంగా రాజాసింగే బండి సంజయ్కు ఫోన్ చేసి.. రఘునందన్ రావుకు పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వాలని కోరినా కనీసం స్పందించలేదని ఆరోపించారు.

ఇటీవలే పార్టీలో చేరిన ఈటలకు సైతం జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చోటు దక్కిందని.. కానీ, తనకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అమ్నేషియా పబ్‌కు సంబంధించిన అంశంపై తాను నాంపల్లి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తానంటే బండి సంజయ్ వద్దని వారించారని ఆరోపించారు.

ఈటల, కోమటిరెడ్డిల వద్ద డబ్బులు ఉన్నాయని, అందుకే జాతీయ నాయకత్వం వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడినట్లుందని రఘునందన్ రావు సెటైర్లు వేశారు. బీసీలకు నాయకత్వం ఇస్తానంటే తాను ఊరుకున్నానని.. కానీ ఇప్పుడు అగ్రకులాల వారికి పగ్గాలు అప్పగిస్తానంటే మాత్రం ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తన గెలుపుతోనే పార్టీకి ఊపొచ్చిందనే విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని రఘునందన్ స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన మోడీ, అమిత్ షా సభలకు సైతం తనకు ఆహ్వనం అందలేదని స్పష్టం చేశారు. తన ఆవేదనను పార్టీ ఇంచార్జులు తరుణ్ చుగ్, బన్సల్ ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయారు. పార్టీ కోసం నిరంతరం కొట్లాడుతున్నా తాను.. ఇంకా ఎంతకాలం వేచి ఉండాలని నిలదీశారు. ఇక ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో దృష్టికి తీసుకెళ్లానని.. అయితే ఆయన కొద్దిరోజులు వేచి చూడాలని సూచించారని చెప్పారు.

Updated : 30 Jun 2023 11:01 AM IST
Tags:    
Next Story
Share it
Top