గెలవడం కోసం చంపడానికైనా, చావడానికైనా భయపడను.. రాజాసింగ్
X
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా సొంత పార్టీ నేతలే తన వెనుక గొయ్యి తవ్వుతున్నారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. నేడు వారందరికీ ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన వ్యూహాలను సొంత మనుషులే తన ప్రత్యర్థులకు చేరవేస్తున్నారంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత మోసం చేసే వారి అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. 2018లో తనను ఓడించటానికి ప్రయత్నించిన వారి లిస్ట్ తన దగ్గరుందని పేర్కొన్నారు. ఎవరెవరు తన ప్రత్యర్థులతో టచ్‌లో ఉన్నారనే విషయం తనకు బాగా తెలుసని పేర్కొన్నారు
తనకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్య అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి తాను చావడానికి భయపడను, ఎవరినైనా చంపడానికి భయపడను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఎవరు కోవర్టులుగా పనిచేశారో నాకు తెలుసు అన్నారు. ఈసారి అలా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక్కడి వారు అక్కడికి సమాచారం ఇస్తే.. అక్కడివారు ఇక్కడ సమాచారం ఇస్తారని మర్చిపోకండి.. అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నమ్మక ద్రోహం చేస్తే వారికి ఎన్నికల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటా అన్నారు. ఇక రాజాసింగ్ గతంలో గోషామహల్‌సెగ్మెంట్ లో రిగ్గింగ్ జరిగిందని, ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.