సిట్టింగ్లను మార్చనందుకే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు - బండి సంజయ్
X
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాత్రమే ఉంటుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు పోటీలోనే లేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కేటీఆర్ అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని బండి విమర్శించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఆ అహంకారం కారణమని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో రూ. 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే.. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్ని అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. దళిత బంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదని నిలదీసిన ఆయన.. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ ఇంకా మారలేదని మండిపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వుందని తెలిసినా కేసీఆర్ వారిని మార్చేందుకు ప్రయత్నించలేదని అన్నారు. అందుకే ప్రజలు ఏకంగా ప్రభుత్వాన్నే మార్చారని విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామన్న ఆయన.. బీఆర్ఎస్ లాగే నామమాత్రంగా దరఖాస్తులు తీసుకోవద్దని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రక్రియ చేపట్టాలని, అన్నిటి కన్నా ముందు రేషన్ కార్డులు ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.